బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి దీపేందర్
దిశ నల్లగొండ, బ్యూరో:
బీహార్‌లో కుల గణాంకాలపై పాట్నా హైకోర్టు స్టే ఇవ్వడం బీసీల మనోభావాలను కించపరచడమేనని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టేకోలు దీపేందర్ మండిపడ్డారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 సంవత్సరంలో జరగాల్సిన వెనకబడిన కులాల జనాభా లెక్కల సేకరణ కరోనా మహ్మమారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతిపక్షాలతో ప్రధాని మోదీని కలిసి కులగణాంకన జరపాలని విన్నవించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నేటికీ కులగణన చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేయాలని నిర్ణయించారని, దీనిపై పాట్నా హైకోర్టు స్టే ఇవ్వడం భాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 1931లో నాటి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో జరిగిన జనాభా గణన కులాల వారీగా చేశారని, కానీ అప్పటి నుంచి నేటి వరకు కులగణన జరగలేదని వివరించారు. మండల కమీషన్ సిఫారసులో భాగంగా ఎస్సీ, ఎస్టీ తరహాలో ఓబీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఓబీసీలకు జరిగే అన్యాయంపై రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో బీసీలు ఏకమై… బీసీ జనాభగణనపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.