Vinayaka Chavithi:వినాయక వ్రత కథ.. ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిందే.. వ్రతకథ విధానం ఇదే..

పూర్వం గజముఖుడయిన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.

విఘ్నేశ్వరుడి వ్రతకథ(Vinayaka Chavithi) చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరవాత వాటిని శిరసుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదుల వల్ల రాజ్యాన్ని, సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్య, తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి ‘రుషివర్యా, మేము రాజ్యాధికారాన్నీ సమస్త వస్తు వాహనాలనూ పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి’ అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు… వినాయకవ్రతం(Vinayaka Chavithi) చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలూ కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.

భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు

‘ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి ‘తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలనూ విజయాలనూ వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని(Vinayaka Chavithi) చెప్పండి’ అని కోరాడు. అందుకు శివుడు ‘నాయనా! సర్వసంపత్కరం, ఉత్తమం, ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆరోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతోగానీ, వెండితోగానీ లేదా మట్టితోగానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమ(Vinayaka Chavithi)ను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలములను, రకమునకు ఇరవైఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ, తాంబూలాదులు ఇవ్వాలి.

బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తిచేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది’అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.

కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే- నీ శత్రువులను జయించి సమస్త సుఖాలనూ పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం(Vinayaka Chavithi) చేయడం వల్లనే… తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితోబాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను’ అంటూ ఇలా చెప్పసాగాడు.

భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు

పూర్వం గజముఖుడయిన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు ‘స్వామీ నువ్వు నా ఉదరమందే నివసించాలి’ అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించినది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియైన హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు.

గజాసురుడు పరమానందభరితుడై ‘ఏమి కావాలో కోరుకోండి… ఇస్తాను’ అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ‘ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు’ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ‘స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించు’ అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్లాడు.

తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.

దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు….ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు…గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.

భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు

శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

ఋషి పత్నులకు నీలాపనిందలు
పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు.

తర్వాత పార్వ‌తీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు.

రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.

భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు

శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి.

అలా వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు.

శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు.

‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని(Vinayaka Chavithi) పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *