- బయ్యక్కపేటలో జన్మించిన దేవత
- ఇక్కడే గుడి, అమ్మ ఆయుధాలు
- దేవరగుట్టపై జలకంబావి
Medaram Jatara : సమ్మక్క పుట్టినూరు బయ్యక్కపేట. సమ్మక్క-సారలమ్మ జాతర మొదట్లో అక్కడే జరిగేది. అయితే భక్తులు ఎక్కువగా రావడంతో బయ్యక్కపేటలో జాతర నిర్వహించడం సమ్మక్క వంశస్థులూ చందా వారికి వసతులు కల్పించడం ఆర్థికంగా కష్టమైంది. దీంతో పాటు మరికొన్ని కారణాల వల్ల 1940 నాటికి జాతరను మేడారంలో జరపడం ప్రారంభమైంది. మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తాడ్వాయి మండలంలో బయ్యక్కపేట ఉంది. సమ్మక్కకు ఇక్కడ గుడి ఉంది. సమ్మక్క గద్దెలూ ఇక్కడ దర్శనమిస్తాయి. గుడిలో సమ్మక్క వాడిన ఆయుధాలు సమ్మక్క చరిత్రకు సాక్ష్యాలుగా. ఉన్నాయి. జాతర తరలింపునకు సంబంధించి సిద్ధబోయిన వంశస్థులతో చేసుకున్న ఒప్పంద కాగితాలు ఇక్కడ అందుబాటులో ఉన్నట్లు చందా పరమయ్య తెలిపారు. జాతరకు సంబంధించిన ఆదాయ, వ్యయాల వాటాలను దీనిలో రాసుకున్నట్లు చందా వంశస్థులు చెబుతున్నారు.
సమ్మక్క దొరికింది ఇలా..
12వ శతాబ్దంలో పొలాస(ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో మేడరాజు(Medaram Jatara) పాలించేవాడు. మేడరాజుకు చిన్నబోయిరాలు, కనకంబోయిరాలు అని ఇద్దరు భార్యలు. ఓ కార్తీకపౌర్ణమి రోజు పెద్ద భార్య చిన్నబోయిరాలు దుంపల కోసం కొంతమంది మహిళలతో కలసి అడవికి వెళ్లింది. అక్కడ తవ్వుతుండగా.. పెట్టె ఒకటి బయటపడింది. దాన్ని తెరిచి చూస్తే అందులో ఓ ఆడబిడ్డ కన్పించింది. పిల్లలు లేని మేడరాజు దంపతులు దైవ ప్రసాదంగా భావించి ఆ పాపను పెంచుకునేందుకు తీసుకెళ్లారు. బిడ్డకు సమ్మక్క అని పేరు పెట్టారు. కొద్దిరోజుల తర్వాత మేడరాజు పెద్ద భార్యకు మన్యుడు, గండ్రగొడ్డలి అనే ఇద్దరు కొడుకులు పుట్టగా, చిన్నభార్యకు నాగులమ్మతో పాటు మరో ఇద్దరు పిల్లలు జన్మించారు. సమ్మక్క మేడరాజు ఇంట్లోనే పెరుగుతూ.. గూడెంలో ఎవరికీ ఏ వ్యాధి వచ్చినా పసరు వైద్యంతోనే నయం చేసేది. ఆమె మాట తీరు, ప్రవర్తన పట్ల గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. మానవ మాత్రులు తినే ఆహారం సరిపోక పోవ డంతో.. రాత్రిళ్లు అందరూ నిద్రపోయిన తర్వాత.. పక్కనే ఉన్న దేవరగుట్టకు పోయి ఆదిశక్తి అవతారం ఎత్తి తనకు నచ్చిన ఆహారాన్ని తిని.. బాలికగా మారి తిరిగి ఇంటికి వచ్చేది. బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన మేడరాజు, కుటుంబ సభ్యులు ఓరోజు రాత్రి బాలికను అనుసరించి దేవరగుట్టకు వెళ్లారు.
Medaram Jatara
బిడ్డ ఆదిశక్తి రూపం దర్శించారు. అప్పటి నుంచి బాలిక ఆదిశక్తిగా భావించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేకంగా చూడడం మొదలుపెడతారు. ఇది నచ్చని సమ్మక్క తనను దేవరగుట్టపై వదిలిరావాలని కోరుతుంది. దీనికి మేడరాజు, గ్రామస్తులు ఒప్పుకోరు. కానీ సమ్మక్క గట్టిగా పట్టుపట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దేవరగుట్టపై వదిలిపెట్టారట. అక్కడ నీటి వసతి కల్పించాలని కోరడంతో మేడరాజు గుట్టకు దగ్గరలో బావిని తవ్వించాడు. ఆ బావిలోనే అమ్మవారు జలకాలాడేదట. అందుకే ఆ బావికి జలకంబావి అని పేరు వచ్చిందని బయ్యక్కపేట గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం అది గక్కవనం అనే దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది.
సమ్మక్కను శాంతింపజేసేందుకు జలకంబావి నీరు..
గిరిజనులు ఈ బావిని నీటిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు కాళ్లకు చెప్పులతో బావిదగ్గరకు పోరు. సమ్మక్క ఉగ్రరూపం దాలిస్తే.. ఆమెను శాంతింపజేసేందుకు ఆనక్కాయ(సొరకాయ) బుర్రలో జలకం బావి నీటిని తీసుకెళ్లి ఆమెపై చల్లుతారు. దీంతో సమ్మక్క శాంతిస్తుందంటూ ఇక్కడి గిరిజనులు చెబుతారు. ఆనవాయితీని నేటికి కొనసాగిస్తున్నామని చందా వంశస్తులు తెలిపారు. మాములు రోజుల్లో ఇక్కడికి వచ్చే సాహసం ఎవరూ చేయరు. జాతర సమయంలో మాత్రమే పుజారులు కాళ్లకు చెప్పులు వేసుకోకుండా వచ్చి ఆనక్కాయ బుర్రలో నీటిని తీసుకెళతారు. ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని తీసుకెళ్లే సమయంలో జలకం బావి నీటిని ఆమెపై చల్లుతారు. ప్రస్తుతం ఈ బావి ఎలాంటి ఆదరణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది.
సమ్మక్క పెండ్లి జరిగింది ఇలా..
దేవరగుట్టపై సమ్మక్కను వదిలి వచ్చిన నాటి నుంచి ఆమె అక్కడే పెరిగి పెద్దవుతుంది. క్రూర జంతువులతో ఆడుకునేదని, జలకం బావిలోనే స్నానం చేసేదని ఇక్కడి గిరిజన భక్తులు నమ్ముతున్నారు. మరోవైపు బయ్యక్కపేటలో నాగులమ్మ సైతం పెరిగి పెద్దయ్యింది. కూతుళ్లకు వివాహం చేయాలని మేడరాజు తలిచాడు. సమ్మక్కకు తన చెల్లెలి కుమారుడు మేడారం పాలకుడు అయిన పగిడిద్దరాజుతో వివాహం జరిపించాలని నిర్ణయించాడు. వారి వివాహంలో నాగులమ్మ గొడవ చేస్తుంది. ఆ గొడవలో నాగులమ్మ చేతికి ఉన్న కడియం తగిలి పడిగిద్దరాజు చేతి నుంచి రక్తం కారినట్టు చందా వంశీయులు చెబుతున్నారు. చివరకు పడిగిద్దరాజు సమ్మక్క, నాగులమ్మలిద్దరినీ వివాహం చేసుకుంటాడు. సమ్మక్కకు నాగులమ్మతో సవతి పోరు ఎక్కువవడంతో సొంతూరు బయ్యక్కపేటకు సారలమ్మతో కలిసి చేరుకుంటుంది. ఈ క్రమంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు సామ్రాజ్య విస్తరణ కాంక్షతో పొలాసపై దండెత్తుతాడు. దీంతో ‘మేడరాజు పారిపోయి వచ్చి మేడారంలో మేనల్లుడి వద్ద తల దాచుకుంటాడు. కాకతీయ సామంత రాజులైన కోయరాజు, పగిడిద్దరాజులు కరువు కాటకాల వల్ల కాకతీయులకు కప్పం చెల్లించలేకపోయారు. మరోవైపు మేడరాజుకు ఆశ్రయం కల్పించడంతో ప్రతాపరుద్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాఘశుద్ధ పౌర్ణమి రోజు మేడారం పై దండెత్తుతాడు. ఈ యుద్ధంలో మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు మరణిస్తారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగు వద్ద వీరోచితంగా పోరాడి నేలకొరుగుతాడు. అప్పటి నుంచి అది జంపన్న వాగుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సమ్మక్క.. శత్రువుల చేతిలో గాయపడడంతో చిలకలగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యలో అదృశ్యమవుతుంది. ఆమెను అనుసరించి వెళ్లిన వారికి ఆమె ఆచూకీ లభించలేదు. ఆ ప్రాంతంలో పుట్ట వద్ద పసుపు, కుంకుమ భరిణె లభిస్తుంది. ఆ భరిణెను సమ్మక్కగా భావించి. పూజిస్తున్నారు.
Medaram Jatara : సమ్మక్క.. మా దేవత.. ఆ చరిత్ర కల్పితం కాదు.. వాస్తవం సమ్మక్క చావలే..
తిరుగువారం..
మేడారంలో జాతర(Medaram Jatara) ముగిసిన 16 రోజుల తర్వాత బయ్యక్కపేటలో చందా వంశస్తులు ఇక్కడ తిరుగువారాన్ని వైభవంగా నిర్వహిస్తారు. దీనికి ఒక రోజు ముందు ఇంటికొకరు చొప్పున తలస్నానం చేసి అడవికి వెళ్లి.. రెల్లు గడ్డి తెచ్చి ఆలయం పైకప్పుపై కప్పుతారు. చుట్టుపక్కల అరుగులు వేసి ఆలయాన్ని అలంకరిస్తారు. సిద్ధబోయిన వంశస్తులు కొమ్ము, డప్పు వాయిద్యాలతో అమ్మవారిని ఊరేగింపుగా గుడికి తీసుకొస్తారు. ఈ సమయంలో దేవరగుట్టలో నాగులకాడి రూపంలో మెరుపు మెరుస్తుందని గిరిజనులు చెబుతున్నారు.
జాతర ఆదాయవ్యయాలపై ఒప్పందం..
బయ్యక్కపేట నుంచి మేడారానికి జాతర తరలింపునకు సంబంధించి అప్పటి ములుగు తాహశీల్దార్ ఆధ్వర్యంలో 61-1944, వ్యయాలపై ఒప్పంద పత్రం రాసుకున్నారు. అది ఇప్పటికీ ఉంది. జాతర మీద వచ్చిన ఆదాయాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగం సమ్మక్క వంశీయుడు చందా పరమయ్యకు, రెండో భాగం నిజాం సర్కార్కు, మూడో భాగం జాతర ఖర్చులకు చెందేలా నిర్ణ
యించి ఇందులో పొందుపరిచారు.